ఓటర్లలో చైతన్యం లేకపోతే మన ఆస్తులను లాగేసుకుంటారని, పాలకులు అలాంటి చట్టాల్నే రూపొందిస్తారని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య హెచ్చరించారు. వీసాలతో అనేక నగరాలు తిరిగే యువతకు తమ ఓటు ఉందోలేదో తెలుసుకునేంత తీరిక ఉండట్లేదని ఆక్షేపించారు. ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం’ అనే అంశంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పద్మనాభయ్య మాట్లాడుతూ.. నగరాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంటే, నగరాలు, పట్టణాల్లోని ఓటర్లు మాత్రం ముసుగులు కప్పుకొని నిద్రపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమే్‌షకుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జనాభాలో 65 శాతం ఓటర్ల జాబితాలో ఉంటే దొంగ ఓటర్లు ఉన్నట్టేనన్నారు. దేశంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మొదటిస్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉన్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో ఓటింగ్ 79 శాతం నమోదవుతున్నా.. ఇది ఇంకా మెరుగుపరడాలన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతూ నగర, పట్టణ ఓటర్లలో నిర్లిప్తత ఎక్కువగా కనిపిస్తోందని, వారిలో చైతన్యం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం’ పేరుతో విజయవాడ డిక్లరేషన్‌ను రూపొందించారు. దీన్ని రౌండ్‌టేబుల్ సమావేశం ఆమోదించింది. సమావేశంలో రోటరీ ఇంటరాక్ట్ డైరెక్టర్ పట్టాభిరామయ్య, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్, రాష్ట్ర గ్రంథాలయాల సంఘ కార్యదర్శి రావి శారద తదితరులు పాల్గొన్నారు.