విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి రూ.64 వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు అన్నారు. మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీని గాలికొదిలేశారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో... ఒక్కో కుటుంబంపై ఈ ప్రభుత్వం రూ.8 లక్షల భారం మోపిందన్నారు. వారంలో సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పారన్నారు. తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నాడన్నారు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. జలయజ్ఞం అంటూ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారని ఆ హామీ ఏమైందని నిలదీశారు. సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్‌పై నాలుక మడతేశారని దెప్పిపొడిచారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికొదిలేశారన్నారు. తాను ఇచ్చిన ఏ హామీనీ జగన్ అమలు చేయలేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.