పశ్చిమ గోదావరి జిల్లా,కైకలూరులో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... ఆకివీడు గ్రామానికి చెందిన మడిచర్ల సోమశేఖర్ (23) ఆదివారం రాత్రి కైకలూరు మండలం ఆలపాడు శివారులో ఉన్న ఉప్పుటేరు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితులతో కలసి ఆ ప్రాంతానికి వచ్చాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్లి ఉప్పుటేరులో దూకేశాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై టి.రామకృష్ణ గజ ఈతగాళ్ళతో ఉప్పుటేరులో గాలించి సోమవారం ఉదయానికి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.