ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య జంపింగ్ జంపాంగ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్ రాని కొంతమంది నేతలు, సీఎం జగన్ మీద అసంతృప్తితో ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవలే వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం బాలశౌరి జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ మీద, సీఎం జగన్ మీద బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సిద్ధం సభల మీద విమర్శలు చేసిన బాలశౌరి.. పారిపోవడానికి సిద్ధమా అంటూ వ్యాఖ్యానించారు. జనసైనికులు జగన్‌ను వేటాడుతారంటూ సీఎం మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో జగన్ మీద బాలశౌరి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. జంపింగ్ జంపాంగ్ అయిన బాలశౌరిని పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద వీరుడని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే జగన్ గురించి అంతా తెలుసంటున్న బాలశౌరి.. వైసీపీ తరుఫున రెండుసార్లు ఎందుకు పోటీచేశారంటూ ప్రశ్నించారు. బాలశౌరి గురించి తెనాలి, నర్సరావుపేట, గుంటూరులో అడిగితే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ గురించి మొత్తం తెలుసన్నవాడికి ఎందుకు వైసీపీ తరుఫున రెండుసార్లు పోటీ చేశావ్. 2014లో వైసీపీ సింబల్ పెట్టుకుని జగన్ బొమ్మమీద గుంటూరులో ఓట్లెందుకు అడుక్కున్నావ్ అంటూ బాలశౌరిని ప్రశ్నించారు.అలాగే 2004లో తెనాలిలో పోటిచేసిన బాలశౌరి, 2009లో నర్సరావుపేటకు పోయాడని, ఆ తర్వాత 2014లో గుంటూరుకు పారిపోయాడని పేర్నినాని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పారిపోయే బాలశౌరి.. జగన్ పారిపోవటం గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు, పారిపోయే బతుకులు మీవి, వైఎస్ఆర్ లేకుంటే నీకు బతుకేలేదంటూ హాట్ కామెంట్చ్ చేశారు. వైఎస్ఆర్ గురించి, జగన్ గురించి ఢిల్లీలో ఎంత అసహ్యంగా మాట్లాడావో మాకు తెలియదా అంటూ ప్రశ్నించారు.మరోవైపు బాలశౌరి జనసేనలో చేరటం వెనుక ఇంతపెద్ద కథ నడిచిందంటూ పేర్నినాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 ప్రారంభంలో బాలశౌరి టీడీపీలో చేరే ప్రయత్నం చేశారన్న పేర్నినాని.. అందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో హరీశ్ శంకర్, మైత్రీ మూవీస్ సినిమా షూటింగ్ స్పాట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు ఓ ప్రొడ్యూసర్ సాయంతో బాలశౌరి వెళ్లారని, జనసేనలో చేరే ప్రయత్నం చేశారని పేర్నినాని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఛీకొట్టడంతో చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లుపట్టుకున్నాడని చెప్పుకొచ్చారు. చిరంజీవితో పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేయించి జూన్, జులైలో పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం అవునా? కాదా? చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. 2004-2009లో తెనాలిలో నాదెండ్ల మనోహర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన బాలశౌరి, చివరకు చిరంజీవితో నాదెండ్ల మనోహర్‌కు ఫోన్ చేయిస్తే ఆయన క్షమించి జనసేనలో చేర్చుకున్నారని పేర్నినాని తెలిపారు. నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగి నిన్ను క్షమించింది అంటూ బాలశౌరిని నిలదీశారు.