మహారాష్ట్రలో రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. ఆ రాష్ట్రంలో చీలిపోయిన పార్టీలు ఎవరివీ అని ఆ పార్టీల్లోని చీలిక వర్గాలు చేస్తున్న పోరాటంపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన తీర్పును ఇచ్చింది. ఇప్పటికే శివసేన పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ షిండేనే.. ఆ పార్టీకి అధినేత అని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ అదే విధమైన తీర్పును వెలువరించింది. ఇప్పటివరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దేనని తేల్చి చెప్పింది.
ఎన్సీపీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అజిత్ పవార్‌కు మాత్రమే ఉందని ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీపీ పేరును, అధికార గుర్తు గడియారాన్ని కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు ముందు శరద్ పవార్‌కు బిగ్ షాక్ తగిలింది. మరోవైపు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా శరద్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. శరద్ పవార్ గ్రూపు ఇప్పుడు కొత్త గుర్తు కోసం ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకోసం బుధవారం 4 గంటల వరకు డెడ్‌లైన్ విధించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి శరద్ పవార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1999 లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. 1999 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలోని యూపీఏ సర్కార్‌లో చేరి 2014 వరకూ కలిసే ఉన్నారు. ఆ సమయంలోనే కేంద్ర మంత్రిగా కూడా శరద్ పవార్ పనిచేశారు. ఆ తర్వాత 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు ఎన్సీపీ కూడా తీవ్ర పరాజయం పాలైంది. 2019 చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా.. సీఎం పదవి విషయంలో ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీతో విభేదించారు. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహా వికాస్ ఆఘాఢీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ.. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే సారథ్యంలో శివసేన పార్టీని చీల్చి.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఆ తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని అజిత్ పవార్ సారథ్యంలో రెండుగా చీల్చింది. అజిత్ పవార్ ప్రస్తుతం బీజేపీ-శివసేన (షిండే) సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.