భారతీయ రైల్వేల నుంచి వచ్చిన సరికొత్త రైళ్లు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ ఇప్పుడు స్లీపర్ వెర్షన్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మార్చి నెలలో వీటికి సంబంధించిన ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అత్యాధునిక హంగులతో స్లీపర్ కోచ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 39 వందే భారత్ చైర్ కార్ వెర్షన్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో 16 ఏసీ 1-టైర్ కోచ్‌లు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ఒక్కో రైలులో 850 బెర్తులు ఉంటాయని వెల్లడించారు. కొన్ని రైళ్లలో మరో 4 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. తొలి దశలో సుదూర ప్రాంతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టే యోచన చేశారు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైళ్లు 2, 3 గంటలు త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటాయని అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ తొలి రైలును ఢిల్లీ - ముంబై నగరాల మధ్య ప్రారంభించనున్నారు. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా, ఢిల్లీ - పాట్నా మార్గాల్లో తొలి దశలో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్న మార్గాల్లో క్రమంగా వాటి స్థానంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ‘రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణ దూరం ఉండే రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించాం. వందే భారత్ స్లీపర్ కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో డిజైన్ చేశారు. ఈ రైళ్లు ఇప్పటివరకు ఇండియన్ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం 2 గంటలు ఆదా అవుతుంది’ అని సదరు రైల్వే అధికారి తెలిపారు. త్వరలో వందే మెట్రో రైలును కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుపడతాయని ఆమె అన్నారు.వందే భారత్ స్లీపర్ రైళ్లలోనూ అత్యాధునిక కవచ్ రక్షణ వ్యవస్థ ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే తెలిపారు. కొత్తగా తయారుచేస్తున్న కోచ్‌లన్నీ ఎల్హెచ్బీ LHB (Linke Hofmann Busch) రకానివే. ఈ బోగీల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కుదుపులు లేని ప్రయాణం, బయో టాయిలెట్లు, అత్యాధునిక డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఈ కోచ్‌ల ప్రత్యేకత.