భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైరల్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీపై, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియోలో పెంపుడు కుక్కకు బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ.. ఆ కుక్క వాటిని తినకపోవడంతో ఆ బిస్కెట్లను పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చారు. అయితే కుక్క బిస్కెట్లను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చి తినమని చెప్తున్నారని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు.
అయితే ఆ వీడియోలో కనిపించింది.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న దానికీ అసలు సంబంధమే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు ఆ వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త కానే కాదని తేల్చి చెప్పారు. ఆ వ్యక్తి ఆ కుక్క యజమాని అని తెలిపిన రాహుల్ గాంధీ.. తాను బిస్కెట్లు ఇస్తే ఆ కుక్క తినలేదని.. అందుకే వాటిని దాని యజమానికి ఇచ్చి తినిపించాలని సూచించినట్లు వెల్లడించారు. దానికి బీజేపీ నేతలు అసత్య ప్రచారాలకు తెరతీశారని ఎదురుదాడి చేశారు.
ఆ సమయంలో ఆ కుక్క చాలా కంగారుగా ఉందని.. భయంతో వణికి పోతోందని రాహుల్ గాంధీ తెలిపారు. ఆ సమయంలో తాను బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నిస్తే అది చాలా భయపడిందని పేర్కొన్నారు. అందుకే తాను ఆ బిస్కెట్లను ఆ కుక్క యజమానికి ఇచ్చి.. తినిపించాలని సూచించినట్లు చెప్పారు. ఇందులో ఏం సమస్య ఉందో తనకు అర్థం కావట్లేదని తెలిపారు. అయితే అందులో ఉన్నది కాంగ్రెస్ కార్యకర్త అని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ కాదని సమాధానం ఇచ్చారు. కుక్కలపై బీజేపీకి ఎందుకు అంత కోపమో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కుక్కలు బీజేపీ ఎలా హాని జరిగిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
అయితే జార్ఖండ్‌లో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా జరిగిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కుక్కలు తినే బిస్కెట్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఇచ్చారని ఆరోపించారు. అందుకు ఆ కార్యకర్త తిరస్కరించారని తెలిపారు. ఇక ఇదే వ్యవహారంలోకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా రంగంలోకి దిగారు. గతంలో తనకు జరిగిన ఓ సంఘటనను హిమంత బిశ్వ శర్మ గుర్తు చేసుకున్నారు. ఒకసారి రాహుల్ గాంధీతో సమావేశం సందర్భంగా తనతోపాటు సీనియర్ నేతలు ఉన్నారని.. అయితే ఆ సమయంలో కుక్కకు వేసిన బిస్కెట్ల ప్లేట్‌లో బిస్కెట్లను తమకు ఇచ్చినట్లు తెలిపారు. కానీ తాను వాటిని తిరస్కరించి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు హిమంత బిశ్వ శర్మ గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి పార్టీ కీలక విషయాల కంటే ఇలాంటి వాటిపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుందని తీవ్ర విమర్శలు చేశారు.