మహాభారత కాలానికి చెందిన స్థలం విషయంలో హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని భాగపత్ జిల్లా బర్నావ పట్టణంలో ఉన్న 100 బీఘాల స్థలం హక్కులు హిందువులకే చెందుతాయని స్థానిక కోర్టు స్పష్టం చేసింది. మహాభారతం ప్రకారం.. అరణ్యవాసం సమయంలో పాండవులు ఇక్కడి లక్క గృహంలో ఉన్నారు. దానిని దుర్యోధనుడు తగుల బెట్టడం, శ్రీకృష్ణుని సలహాతో లక్క గృహం నుంచి భీముడు సొరంగం తవ్వడం, పాండవులు అక్కడ నుంచి తప్పించుకుని బయటపడ్డారని చదువుకున్నాం. ఆ లక్క ఇల్లు, సొరంగం ఉన్న ప్రదేశమే భాగపత్ జిల్లాలోని బర్నావా.
ఈ ప్రదేశంపై హక్కులు తమకే చెందుతాయని 53 ఏళ్ల కింద స్థానిక కోర్టులో హిందువులు పిటిషన్ వేశారు.అయితే, 600 ఏళ్ల కిందట కన్నుమూసిన సూఫీ ప్రబోధకుడు షేక్ బద్రుద్దిన్ షా సమాధి కాబట్టి అది తమదే అని ముస్లింలు వాదించారు. తాజాగా, ఈ కేసులో న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. అది మహాభారత కాలం నాటి పాండవుల లక్క ఇల్లు, సొరంగం ఉన్న ప్రదేశమే అని పేర్కొంది.
కాగా, 1970 నుంచి వివాదం కొనసాగుతోంది. బర్నావాకు చెందిన ముకీమ్ ఖాన్ వక్ఫ్ బోర్డు అధికారి హోదాలో మీరట్ కోర్టులో కేసు వేశాడు. ఇది లక్షగృహ ఆనవాళ్లు అనీ, హిందువులకే చెందాలని లక్షగృహ (లక్క ఇల్లు) గురుకుల స్థాపకుడు కృష్ణదత్ మహారాజ్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాడు. షేక్ బద్రుద్దీన్ సమాధి, పెద్ద శ్మశానవాటిక ఉన్నాయని ఈ స్థలంపై హక్కులు వక్ఫ్ బోర్డుకు చెందుతాయని ముకీమ్ వాదించారు. అంతేకాదు హిందువులు ఆ శ్మశానవాటికను ధ్వంసం చేసి, పుణ్యక్షేత్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ముకీమ్ ఖాన్, కృష్ణదత్ మరణించినా.. ఈ కేసు సుదీర్ఘంగా సాగుతోంది. పాండవుల లక్కఇల్లు ఇక్కడే ఉండేదనీ, దాన్ని తగులబెట్టి వాళ్లను హతమార్చే కుట్ర నుంచి ఒక సొరంగం ద్వారా తప్పించుకున్నారనీ, పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు కూడా లభించాయనేది హిందూ పక్షం వాదన. వేల ఏళ్ల నాటి ఆ ఆనవాళ్లు హిందూ నాగరికతకు సంబంధించినవేనని వాదించారు. ఆర్కియాలజికల్ సర్వే 1952లో తవ్వకాలు జరిపితే 4500 ఏళ్ల నాటి కుండలు లభ్యమయ్యాయని చెబుతారు. మహాభారత కాలం కూడా అదేనని హిందువులు నమ్ముతారు.