ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమమయం దగ్గరపడటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే పేరిట సామాన్యులను తనిఖీల పేరిట ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చేంతవరకూ.. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదుతో పట్టుబడితేనే దాన్ని జప్తు చేసి ఆదాయపు పన్ను శాఖకు సమాచారమివ్వాలన్నారు. వెలగపూడి సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరస్పర సమాచార మార్పిడి, సమన్వయం కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికార్యాలయం డేటా మొత్తం ఈసీఐ వద్ద భద్రంగా ఉందని సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఈసీఐ నిర్దేశించిన బలమైన డేటా సెక్యూరిటీ ఆధారంగా తమ కార్యాలయం పారదర్శకంగా పని చేస్తుందని అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న డేటా ఎలా పోతుందన్నారు. ఈసీ పరిధిలో ఉండే ఈఆర్‌వో నెట్ నుంచి ఎలాంటి సమాచారం డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదని.. ఏదైనా సమాచారం కోసం సీఈవో, డీఈవో, ఈఆర్వోకి కేవలం కొద్దిపాటి సౌలభ్యమే ఉంటుందన్నారు. ఈసీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్‌వో నెట్ 2.0 ఉపయోగిస్తుందని.. ఈ డేటా మొత్తం సైబర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం దాని భద్రంగా ఉంటాయని తెలిపారు. సీఈవో వెబ్‌సైట్‌లో సాధారణ ప్రజల కోసం కొంత సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు హార్డ్‌డి్‌స్కలు అందిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం.. కొందరిని తొలగించడం లాంటివి సీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని ప్రతి వారం సీఈవో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించాలంటే కేంద్ర, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని మీనా పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల మధ్య సమన్వయం కోసం త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.