కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి రాసిచ్చేశామంటూ కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.. అసలు కృష్ణాజలాలను ఏపీకి రాసిచ్చింది ఆయనేనన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేవంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ శాసనసభలో మాట్లాడారు.‘ప్రగతిభవన్లో జగన్‌కు కేసీఆర్ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లో కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పైనే పునాదిరాయి పడింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఏపీ పోలీసులు ఏకే–47 తుపాకులతో వచ్చి పూర్తిగా మన భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ను ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసుల్లా ఇక్కడి ప్రభుత్వం చూస్తుండిపోయింది. ఇంటిదొంగల సహకారం లేకుంటే వాళ్లు వచ్చేవారా? కేసీఆర్ రాయలసీమకు వెళ్లి.. మంత్రి రోజా పెట్టిన రాగిసంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమను చేస్తా అని వచ్చిండు. అలుసు ఇచ్చినందునే.. మన జలాలను వాళ్లు కొట్టుకుపోయిన్రు. ఇప్పుడు మేమొచ్చాక అట్లెట్లా కొట్టుకుపోతారని ప్రశ్నిస్తున్నారు’ అని రేవంత్ ఆక్షేపించారు.