ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ జేఈవో సదా భార్గవికి ఉద్యోగులు, సిబ్బంది వీడ్కోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 07:32 PM

టీటీడీ జేఈవో సదా భార్గవి దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు ఈవో ధర్మారెడ్డి. ఈవోగా తాను అప్పగించిన పనులను ఎంతో చిత్తశుద్ధితో చేశారని.. సదా భార్గవి బదిలీ సందర్భంగా తిరుపతిలోని మహతి కళామందిరంలో ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డితో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు శ్రీమతి సదా భార్గవిని ఘనంగా సన్మానించారు. సదా భార్గవి టీటీడీలో ఆరోగ్యం, విద్య విభాగాలతోపాటు ఇతర విభాగాలను చక్కగా నిర్వహించారని తెలియజేశారు. సిమ్స్ ఆసుపత్రిని ఆరు నెలల్లో ఎంతో అభివృద్ధి చేసి రోగుల్లో విశ్వాసం పెంచారని చెప్పారు. అవయవ మార్పిడి కోసం స్విమ్స్ లో అన్ని వసతులు కల్పించారని, తద్వారా మొదటిసారి మూడు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.


టీటీడీ డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడుతో పాటు అటానమస్ హోదా లభించేందుకు ఎంతో కృషి చేశారని, విద్యాసంస్థల్లో 120 జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేశారని వెల్లడించారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించారని, దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిందని అన్నారు. గత బ్రహ్మోత్సవాల్లో నైపుణ్యం గల కళాబృందాలను ఎంపిక చేసి భక్తుల మన్ననలు అందుకున్నారని చెప్పారు. సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ గల కొనుగోళ్లు, వేర్ హౌసింగ్ విభాగాన్ని చక్కగా నిర్వహించి టీటీడీకి అవసరమైన సరుకులను సకాలంలో అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో జెఈవో ప్రముఖ పాత్రను పోషించారని తెలియజేశారు.


టీటీడీలో మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు పని చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు జేఈవో సదా భార్గవి. తల్లిదండ్రుల ఆశీస్సులతోనే స్వామివారి సన్నిధిలో అంకితభావంతో సేవలు అందించానని చెప్పారు. టీటీడీ ఉద్యోగులు ఎంతో అదృష్టవంతులని, పూర్తి కాలం పాటు ఇక్కడే ఉండి భక్తులకు సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన ఉద్యోగ కాలంలో సహకరించిన టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రస్తుత ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, అప్పటి ఈవోలు అనిల్ కుమార్ సింఘాల్, డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, ప్రస్తుత ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మంకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ ఛైర్మన్, ఈవోలు తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో అంకితభావంతో నిర్వర్తించానన్నారు. ఇందులో టీటీడీ ఆస్తుల శ్వేతపత్రం సిద్ధం చేయడం, విద్యాసంస్థలకు అటానమస్ హోదా, 119 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ వర్తింప చేయడం తదితరాలు ఉన్నాయన్నారు.


శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 6800 మంది ఓట్సోర్సింగ్ ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, గుర్తింపు కార్డు, లడ్డూ ప్రసాదం ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ద్వారా ఇప్పటివరకు 11 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలియజేశారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎనిమిది పురాణాల ముద్రణ పూర్తిచేశామన్నారు. గతేడాది జరిగిన శ్రీవారి రెండు బ్రహ్మోత్సవాల్లో దాదాపు 14 రాష్ట్రాల నుండి కళాబృందాలను ఆహ్వానించామన్నారు. అదేవిధంగా ఆయుర్వేద కళాశాల, పరకామణి విభాగం, గోశాల, వైద్య విభాగం తదితర విభాగాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తమకు సహకరించిన అన్ని విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.


టీటీడీలో మొదటి మహిళా ఐఏఎస్ అధికారిగా సదా భార్గవి చరిత్ర సృష్టించారన్నారు జేఈవో వీరబ్రహ్మం. విద్యాసంస్థలను, ఆసుపత్రులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. గత ఏడాది రథసప్తమి, రెండు బ్రహ్మోత్సవాల్లో చక్కటి కళాబృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా సమయంలో ఉద్యోగులకు చక్కటి వైద్య సేవలు అందించారని కొనియాడారు. జేఈవో సదా భార్గవికి ఏ బాధ్యతలు అప్పగించినా తనదైన శైలిలో ఎంతో చక్కగా నిర్వహించారని చెప్పారు టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్. శుద్ధ తిరుమల – సుందర తిరుమల కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షించారని తెలియజేశారు. స్విమ్స్ ఇంఛార్జ్ డైరెక్టరుగా సదా భార్గవి పాలనను గాడిన పెట్టారన్నారు సిమ్స్ డైరెక్టర్, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్. పదేళ్లుగా పెండింగులో ఉన్న డాక్టర్లకు ప్రమోషన్లు కల్పించారని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com