ప్రధాని మోదీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి శిక్ష విధించడం ఏంటని అనుకుంటున్నారా. మీరు వింటున్నది నిజమే.. ప్రధాని 8మంది ఎంపీలను పిలిచి ఓ శిక్ష విధిస్తున్నాను అన్నారు. అదేంటని ఎంపీలు షాకయ్యే లోపు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటు క్యాంటీన్‌లో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. 8 మంది ఎంపీలను మాత్రం ఆహ్వానించడం విశేషం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే ఆహ్వానం అందింది. శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడును మాత్రమే విందుకు పిలిచారు.
మిగిలినవారి విషయానికి వస్తే.. హీనా గావిత్, ఎస్.ఫాంగ్నాన్ కొన్యాక్, జమ్యాంగ్ త్సెరింగ్ నమ్‌గ్యాల్, ఎల్.మురుగన్(బీజేపీ), రితేష్ పాండే (బీఎస్పీ), సస్మిత్ పాత్ర (బీజేడీ), ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పీ) తదితరులతో కలిసి పార్లమెంటు క్యాంటీన్‌లో ప్రధాని భోజనం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రధాని మోదీ ఎంపీలను ఆహ్వానించారు. ‘ఈ రోజు మీకు శిక్ష విధిస్తా.. నాతో కలిసి భోజనం చేయడమే ఆ శిక్ష’ అంటూ సరదాగా అన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు వారితో పలు అంశాలపై మాట్లాడుతూ భోజనం కొనసాగించారు. క్యాంటీన్‌లో ఉన్న శాకాహార భోజనం, రాగి లడ్డూలను ప్రధాని, ఎంపీలు తిన్నారు. ప్రధాని మోదీ విందు దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘పసందైన విందును ఆస్వాదించాం. కలిసి భోజనం చేసిన సహచర ఎంపీలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు ప్రధాని.