నరేంద్ర మోదీ. ఈ పేరు కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ మారుమోగిపోతోంది. ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ.. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిని ఆర్జించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన మోదీ.. ఎన్నో ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేశారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం విశేషం. ప్రతిపక్షాల విమర్శలు ఎన్ని ఉన్నా.. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ అని అడిగితే మోదీ పేరే మొదట వస్తుంది. ఇక బీజేపీలో నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరూ అని అడిగినపుడు రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. దీనిపైనే తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పలువురి పేర్లు వెల్లడి అయ్యాయి.
నరేంద్ర మోదీని చూసి బీజేపీకి ఓటు వేసేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. 2014 తోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలు, ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ చూసి బీజేపీకి ఓటు వేసిన ఓటర్లు చాలా మందే ఉన్నారు. అందుకే ఏ ఎన్నికల ర్యాలీ, ప్రచారం, బహిరంగ సభల్లో మోదీ.. మోదీ.. అనే నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంటుందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారని వెల్లడించింది.
ఈ క్రమంలోనే బీజేపీ నేతలతోపాటు దేశ ప్రజల్లోనూ ఒక ప్రశ్న నెలకొంది. మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు అనేదానిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దానిపై కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీలో చాణుక్యుడిగా పిలుచుకునే అమిత్ షా.. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నిలిచారు. అయితే దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ 15 వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 28 వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేను 2024 ఫిబ్రవరి పేరుతో విడుదల చేసింది. మొత్తం 35,801 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెలువరించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత 29 శాతంతో అమిత్ షా రెండో స్థానంలో.. 25 శాతంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో.. ఆ తర్వాత 16 శాతంతో నితిన్ గడ్కరీ నాలుగో స్థానంలో నిలిచారు.