బయటే కాకుండా సోషల్ మీడియాలో కూడా నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా చాలా పాపులర్ అయ్యారు. ఆయన చేసే పోస్ట్‌లు, షేర్ చేసే ఫన్నీ ట్వీట్లు.. నెటిజన్లను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఏ విషయాన్నైనా తన పోస్టుల ద్వారా వెల్లడించే టెమ్‌జెన్ ఇమ్నా.. తమ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, వారి సమస్యలు, విషయాలు చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ అందరికీ తెలియజేస్తూ ఉంటారు. అలాంటి టెమ్‌జెన్ ఇమ్నా.. తాజాగా షేర్ చేసిన ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఫన్నీగా షేర్ చేసిన ఆ వీడియో వెనకాల చాలా పెద్ద విషయమే దాగి ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆ వీడియోలో టెమ్‌జెన్ ఇమ్నా ఓ చెరువులో చిక్కుకున్నట్లు ఉంది. బురదతో కూడి ఉన్న ఆ చెరువు నుంచి బయటికి వచ్చేందుకు టెమ్‌జెన్ ఇమ్నా.. చాలా కష్టపడుతున్నారు. ఇక ఆ వీడియోలో ఉన్న మరో వ్యక్తి టెమ్‌జెన్ ఇమ్నాను వెనుక నుంచి ఒడ్డుపైకి తోస్తున్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు ముందు నుంచి ఆయనను నీటి నుంచి లాగడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా మాత్రం ఆ చెరువులోని బురదలోకి జారిపోతున్నారు. చాలాసేపు ప్రయత్నాల తర్వాత ఆయన చెరువు నుంచి ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ వీడియో ఫన్నీగా ఉన్నా.. దాన్ని షేర్ చేయడానికి చాలా తతంగం ఉంది. అయితే కొత్త కారును కొనుగోలు చేసేవారికి అవగాహన కల్పించేందుకే నాగాలాండ్ మంత్రి ఈ వీడియోను పంచుకున్నారు. కారును కొనుగోలు చేసే ముందు దాని న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్-ఎన్‌సీఏపీ రేటింగ్‌ను తనిఖీ చేయాలని కస్టమర్లకు సూచించేందుకే ఆయన ఈ ఫన్నీ పోస్ట్‌ను షేర్ చేశారు.
ఇక ఆ వీడియోకు మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇవాళ జేసీబీకే పరీక్ష. గమనిక: ఎన్‌సీఏపీ రేటింగ్ గురించి చెప్పడానికే ఈ ప్రయత్నం. కారు కొనుగోలు చేసే ముందు దాని ఎన్‌సీఏపీ రేటింగ్‌ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం`` అని క్యాప్షన్ జోడించారు. దీంతో అసలు సంగతేంటో నెటిజన్లకు అర్థం అయిపోయింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. లక్షలమంది వీక్షించారు. లైక్, షేర్లు, కామెంట్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.