తిరుమలలో ఆదివారం ఏనుగుల సంచారం కలకలం రేపింది. పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం సమీపంలో శనివారం రాత్రి ఏనుగులు అడవి నుంచి రోడ్డు దాటి డ్యాం వైపు వెళ్లాయి. అదే మార్గంలో తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల పాదముద్రలను బట్టి ఐదారు ఏనుగులుండవచ్చని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏనుగుల గుంపు పార్వేట మండపం పక్కనే ఉన్న శ్రీగంధ వనం ఇనుప కంచె, చెట్లను ధ్వంసం చేశాయి. రాత్రి వేళ పాపవినాశనం మార్గాన్ని టీటీడీ మూసివేస్తుంది కాబట్టి ఏనుగుల గుంపు సంచారం కారణంగా భక్తులకు ఇబ్బంది కలగలేదు. డ్యాంలో నీటిని తాగేందుకే ఏనుగులు వచ్చి ఉంటాయని అఽధికారులు భావిస్తున్నారు. గతేడాది కూడా ఇదే సమయంలో ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరించడం గమనార్హం.