దళితులను దారుణంగా అణగదొక్కిన సీఎం జగన్‌రెడ్డిని గద్దె దించడమే దళిత సింహగర్జన సభ ముఖ్యోద్దేశమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఇది అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటమని, ఎట్టి పరిస్థితుల్లో జగన్‌ను గద్దె దించే వరకు పోరాటం ఆగదని చెప్పారు. ఓటుకు రూ.10 వేలు ఇస్తే తీసుకోండి కానీ జగన్‌కు మాత్రం ఓటేయద్దన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన ఆదివారం జరిగిన దళిత సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎం అయిన నాటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది దళితులు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు గురయ్యారన్నారు. ప్రశ్నించిన ప్రతి గొంతును అణచివేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎన్నికల సీటు కోసమే ఈ రోజు సభ పెట్టినట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ సభ దళితుల ఆత్మగౌరవ సభ అని, దగా పడ్డ దళితుడు తిరగబడకపోతే ఇంకా నష్టపోతామని తెలియజేయడానికే సభను పెట్టామన్నారు. హర్షకుమార్ తనయులు జీవీశ్రీరాజ్, సుందర్ పర్యవేక్షించారు. ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేత జార్జి సీమంతుల, దళిత సంఘాల నేతలు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు.