ఏపీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. వైసీపీలో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి నేతలు బయటకు వస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ బీసీ వింగ్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ చెప్పే సామాజిక న్యాయం.. వైసీపీలో నేతిబీరకాయలో నెయ్యిలాంటిదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీలో బీసీలను అణచివేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద, వైసీపీ ప్రభుత్వంపైనా ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో బీసీలను అణచి వేస్తున్నారన్న జంగా కృష్ణమూర్తి.. బీసీలకు కేవలం నామమాత్రపు పదవులు ఇచ్చారని, అధికారాలు మాత్రం లేవని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి ఆ పార్టీలో లేదని విమర్శించారు. కీలక పదవులు అన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయన్న జంగా కృష్ణమూర్తి.. బీసీల ఆత్మ గౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి వైసీపీలో ఉందన్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ మీద కూడా జంగా కృష్ణమూర్తి విమర్శలు చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పే జగన్.. వారి మనసులో ఉన్నదేమిటో మాత్రం కనిపెట్టడం లేదన్నారు.
ఇక జగన్ గెలుపులో తాను కూడా భాగస్వామినేనన్న జంగా కృష్ణమూర్తి.. జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. కానీ జగన్ ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని.. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఏపీలోని 139 బీసీ సామాజిక వర్గాలు జగన్‌ను నమ్మాయని. కానీ జగన్ వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీలోని 56 కార్పొరేషన్ ఛైర్మన్లను జగన్ కలవలేదన్న జంగా కృష్ణమూర్తి.. ఏ ఒక్క దానిలో కూడా నిధులు లేవన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు న్యాయం జరగలేదనీ, బీసీలకు పదవులతో పాటుగా గౌరవం కూడా కావాలని అన్నారు. అందుకే బీసీలంతా కలిసి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మరోవైపు గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి విభేదాలు ఉన్నాయి. గురజాలలో వైసీపీ టికెట్ కోసం జంగా కృష్ణమూర్తి కూడా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైసీపీ వర్గాలు తిప్పికొడుతున్నాయి.