నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించి, ఓదార్చి.. వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగుతుంది. మొదటి రోజు కదిరిలో నారా భువనేశ్వరి బస చేస్తారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు, 11:20కు పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 01:10 గంటలకు గాజుకుంటపల్లి గ్రామం, ఓబుళదేవచెరువు మండలంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. 02:45కు కదిరి నియోజకవర్గం, కదిరి టౌన్, 8వ వార్డులో కార్యకర్త కుటుంబానికి పరామర్శించనున్నారు. సాయంత్రం 04:15 గంటలకు తనకల్లు మండలం, కొర్తికోట గ్రామంలో కార్యకర్త ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు.05:40కు ముష్టిపల్లి గ్రామం, కదిరి రూరల్ మండలంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు, 06:45కు తలపుల మండలం, తలపుల గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శించిన అనంతరరం రాత్రి 07:50 గంటలకు బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.కాగా నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మండలంలోని గాజులపల్లిలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించనున్నారని, ఆమె పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి 53 రోజులు జైల్లో ఉంచడాన్ని జీర్ణిం చుకోలేక గాజులపల్లికి చెందిన మునిమడుగు బాబయ్య మృతి చెందారని, ఆయన కుటుంబాన్ని పరామర్శిం చేందుకు భువనేశ్వరి రానున్నారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే ఓబుళదేవరచెరువు మండలం గాజుకుంటపల్లిలో మేకల రామచంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు భువనేశ్వరి రానున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర తెలిపారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు హాజరై ఆమె పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా తనకల్లు మండలం కొర్తికోట గ్రామానికి కూడా భువనేశ్వరి రానున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ తొట్లి రెడ్డి శేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఎస్‌కె మస్తానవలి తెలిపారు. గ్రామంలో ఎస్‌కె బుడనసాబ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారని వివరించారు. మంగళ వారం మధ్యాహ్నం 3గంటలకు కొర్తికోటలో ఆమె పర్యటన ఉంటుందన్నారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.