ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ భీమవరంలో పర్యటన రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 02:25 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమిని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రెండు పార్టీల్లోని అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్లాన్‌లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా వరుస ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ హైకమాండ్ ప్రణాళికలను సిద్ధం చేసింది. బుధవారం నుంచి పవన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. భీమవరం పట్టణానికి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు జనసేనాని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుకుంటున్నట్లు సమాచారం. భీమవరం విష్ణు కాలేజీలోని హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌‌కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. హెలిప్యాడ్‌ పరిశీలనలో భాగంగా పోలీసు శాఖ, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అయితే ఆర్అండ్‌బీ శాఖ ఆంక్షల పేరుతో అడ్డుకుంటుందని సమాచారం. ఆర్‌అండ్‌‌బీ శాఖ అధికారి మాత్రం వింత వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. దూరంగా ఉన్న భవనాలను సాకుగా చూపించి హెలిప్యాడ్ అనుమతిని నిరాకరిస్తున్నారు. మరెక్కడో ఉన్న టవర్‌ను అధికారులు చూపిస్తున్నారు. ఆర్ అండ్‌ బీ అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ హెలిప్యాడ్‌లో దిగారు. అప్పటికీ ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు ఏమి లేవని జనసేన నేతలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్‌కు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com