ప్రముఖ తమిళ నటి గౌతమి తాడిమల్ల.. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం-ఏఐడీఎంకే పార్టీ కండువా కప్పుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం ఎడప్పాటి పళనిస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న పళనిస్వామి ఇంటికి వెళ్లిన గౌతమి.. ఆయనతో చర్చించారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే పళనిస్వామి సమక్షంలో గౌతమి పార్టీలో చేరిన ఫోటో బయటికి వచ్చింది. అయితే సుదీర్ఘ కాలం బీజేపీలో ఉన్న గౌతమి.. కొన్ని నెలల క్రితం ఆ పార్టీని వీడారు. అయితే గత కొన్ని నెలలుగా ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉన్న గౌతమి.. ఎట్టకేలకు తన రాజకీయ అడుగు వేస్తూ ఏఐడీఎంకేలో చేరారు.
25 ఏళ్ల పాటు బీజేపీలో గౌతమి ఉన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరులో కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే తాను ఆపదలో ఉన్నప్పుడు పార్టీ నుంచి మద్దతు కరవైందని ఆరోపిస్తూ గౌతమి బీజేపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక గౌతమి.. 2004 నుంచి 2016 వరకు విశ్వనటుడు కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. అయితే గతంలో బీజేపీలో ఉన్న మరో నటి గాయత్రి రఘురామ్.. కొన్నేళ్లుగా ఆ పార్టీలోనే ఉండి.. ఇటీవలె అన్నాడీఎంకేలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలైతో విభేదాల కారణంగా గాయత్రి రఘురామ్ ఆ పార్టీని వీడి గత నెలలో ఏఐడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.