పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కర్నూలు జిల్లా ఏపీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలపై కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ జి.సృజనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..... ప్రతి ఉద్యోగికి రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు బకాయిలు చెల్లించాలన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమేనని గుర్తించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఫుల్‌టైం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జడ్పీ యాజమాన్యంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు పోస్టులను అప్‌గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలి. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు 17న తాలుకా కేంద్రంలో ధర్నా, 20న ర్యాలీ, 21 వరకు రాష్ట్ర నాయకుల జిల్లాల పర్యటన, 27న ఛలో విజయవాడ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కాశన్న, జవహర్, గోకారి, నవీన్, రంగన్న, మద్దిలేటి పాల్గొన్నారు.