సామాజిక న్యాయాన్ని జపిస్తున్న జగన్ రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. బుధవారం రాత్రి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో, ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేట వద్ద, సాయంత్రం సాలూరులో జరిగిన శంఖారావం బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. బీసీ, ఎస్సీ ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయడమేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. ‘సొంత సామాజికవర్గ ప్రతినిధుల జోలికి పోకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై పడ్డారు. యాదవ కులానికి చెందిన జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి, కర్నూలు ఎంపీ సంజీవ్ సహా అనేక మందిని వేరే ప్రాంతాలకు పంపారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27సంక్షేమ పథకాలను అకారణంగా రద్దు చేశారు. స్థానికసంస్థల రిజర్వేషన్లలో 10 శాతం తగ్గించారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు స్థానిక కోటా పెంచుతాం. రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం’ అని వెల్లడించారు. మూడు రాజధానుల పేరుతో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంరఽధను దోచుకుంటున్నారని.. పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కాపాడతామన్నారు. భోగాపురం, తారకరామతీర్థసాగర్, నదుల అనుసంధానం,అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని.. వీటిని పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. బీసీలపై 27వేల కేసులు పెట్టి వారి వెన్నుముక విరగ్గొట్టారని.. బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్ వెన్నుముక విరగ్గొట్టాలని పిలుపిచ్చారు.