సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున హైదరాబాద్ రాజధాని డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని, వైసీపీ మూడు ముక్కలాటతో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని విమర్శించారు. గత నాలుగున్నరేళ్లుగా హైదరాబాద్ ఊసేత్తని వైసీపీ, ఇప్పుడు నిద్రలేచిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో రెండేళ్లు కావాలంటూ మరో కుట్రకు వైసీపీ తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజున నాగార్జునసాగర్ డ్యాంపై హడావుడి సృష్టించి, కేసీఆర్‌కు లబ్ధి చేకూరేందుకు జగన్ విశ్వ ప్రయత్నం చేశారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల డ్రామాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు.