ప్రస్తుతం అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుపెడుతోంది. చాలా కంపెనీలు ఏఐ బేస్డ్ సర్వీసులు లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో చాట్‌జీపీటీకి పోటీగా రూపొందించిన బార్డ్ ఏఐ చాట్‌బాట్‌కు గూగుల్ కొత్త పేరు పెట్టింది. దీనికి 'జెమిని(Gemini AI)'గా పేరు మార్చి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీని వినియోగం గురించి యూజర్లకు గూగుల్ (Google) తాజాగా ఒక వార్నింగ్ ఇచ్చింది. ప్రైవరీ రిస్క్ గురించి కొన్ని సూచనలు చేసింది.
గూగుల్ జెమినితో ఏ స్థాయి ఫలితాలు అందుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలు అందుకునేలా కొత్త AI ప్లాట్‌ఫారమ్‌పై హైప్ క్రియేట్ అయింది. అయితే ఇతర AI టూల్స్ మాదిరిగానే, జెమినితో కూడా ప్రైవసీ రిస్క్ ఉంటుంది. అందుకే ఉద్యోగులు ఈ టూల్స్ వినియోగిస్తున్నప్పుడు, డేటాను షేర్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కంపెనీలు జాగ్రత్తగా ఉండాలని గూగుల్ సూచిస్తోంది.
AI ప్లాట్‌ఫామ్స్ చాలా వరకు ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉన్నాయి. ఫస్ట్-జనరేషన్ AI చాట్‌బాట్స్‌కు వ్యక్తిగత డేటాను షేర్ చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చనే సెక్యూరిటీ రిస్క్‌లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ జెమిని యూజర్లకు కొన్ని సూచనలు ఇచ్చింది.
జెమిని AIతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి గూగుల్ పారదర్శకంగా ఉంటుంది. ఈ టూల్‌కు యూజర్లు అందించే పర్సనల్ డేటాను మానవులు సమీక్షించవచ్చని, ఇది ప్రైవసీ గురించి ఆందోళనలను పెంచుతుందని వినియోగదారులను హెచ్చరిస్తోంది. ఈ వార్నింగ్‌ను సపోర్ట్ పేజీలో ప్రముఖంగా చూపుతోంది.ప్రైవసీ రిస్కులు తగ్గించడానికి, AI చాట్‌బాట్‌తో ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి ప్రైవసీ ఇన్‌ఫర్మేషన్ షేర్ చేయకూడదని గూగుల్ వినియోగదారులకు సలహా ఇస్తోంది. డేటా మాన్యువల్‌గా రివ్యూ చేస్తారని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవాల్సిన అవసరాన్ని కంపెనీ హైలైట్ చేస్తోంది.