తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన చింతలపూడిని ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులకు కానుకగా ఇస్తానని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజానాడి స్పష్టంగా ఉందని, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో పాత మున్సిపాల్టీల్లో నూజి వీడు ఒకటని, అయినా ఆ స్థాయిలో నూజివీడు పట్టణం అభివృద్ధి సాధించ లేదన్నారు. తాను అధికారంలోకి రాగానే మున్సిపల్ నిధులు, కేంద్ర నిధులు ఏవి అందుబాటులో ఉన్నా నూజివీడులో రహదారుల విస్తరణ చేపట్టడంతో పాటు డ్రైనేజి వ్యవస్థ మెరుగుకు చర్యలు చేపట్టి పరిసర ప్రాంతాలకు కేంద్ర స్థానంగా నూజివీడును అభివృద్ధి చేస్తానన్నారు. నూజివీడు పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో మాట్లాడటానికి వచ్చిన ఆయనను నూజివీడు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పసుపులేటి జగన్, పట్టణ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ సాదరంగా ఆహ్వానించారు. నూజివీడు కౌన్సిలర్‌లు యార్లగడ్డ ప్రసాద్, తిరుమలశెట్టి సాధనా స్రవంతి, పట్టణ క్లస్టర్ ఇన్‌చార్జ్ ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.