ఏపీలో వైఎస్సార్‌సీపీకి వరుస షాక్‌లు తగులున్నాయి. టీడీపీలోకి అధికార పార్టీ నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్య నేతలు పలువురు చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం కండువాలు కప్పుకున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు అట్లా చిన్నవెంకటరెడ్డి, సంతమాగులూరు ఎంపీపీ ఏనుబర్ల యలమందలు తన వర్గంతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడు, శాప్‌నెట్ ఛైర్మన్ బాచిన కృష్ణచైతన్య చంద్రబాబుతో భేటీ అయ్యారు. త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతం నుంచి ఉన్న పరిచయంతో చంద్రబాబు వారిని సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.
బాచిన చైతన్యకు దర్శి టీడీపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును గరటయ్య కోరారు. అయితే చైతన్యకు న్యాయం జరుగుతుందని అభయమిచ్చి జనసేనతో పొత్తును ప్రస్తావిస్తూ దర్శిని జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని సహకారం అందిస్తానని చెప్పినట్లు సమాచారం. బాచిన గరటయ్య, చైతన్యలు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను కూడా కలిసి మాట్లాడారు. మరోవైపు గరటయ్య, చైతన్యలను వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. చంద్రబాబును కలిసిన కొద్దిసేపటికే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సూరా శ్రీనివాసుల రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జడ్పీటీసీ సభ్యురాలు సూరా దీప, కౌన్సిలర్ అందె దీపలు టీడీపీలో చేరారు. అలాగే కర్నూలు నియోజకవర్గానికి చెందిన సీనియర్ మైనారిటీ నాయకుడు మహ్మద్ ఖాసీ, వాసవీ పైపుల కంపెనీ అధినేత సత్రశాల జగన్నాథ్ గుప్తా.. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ పుల్ల విజయా రెడ్డి, ఆవుల మనోహర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కాటన్ బోర్డు మాజీ సభ్యుడు శ్రీనివాస రెడ్డి.. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ నీలకంఠారెడ్డితోపాటు వివిధ నియోజకవర్గాల నుంచి మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, సీనియర్ నేతలు భారీగా తరలివచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి, నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి శ్రీకృష్ణదేవరాయలు చర్చించినట్టు సమాచారం. త్వరలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యం ఉర్పడింది. ఈ భేటీలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.