తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు 9 మందిని బలి తీసుకుంది. అత్యంత భారీ పేలుడు సంభవించిందని.. ఆ పేలుడు ధాటికి నాలుగు భవనాలతోపాటు బాణసంచా ఫ్యాక్టరీ కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. విషయం తెలుసుకోగానే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. చనిపోయినవారిని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీలకు తరలించారు.
తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రోజూ లాగే శనివారం కూడా బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో పటాసులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఆ శక్తివంతమైన పేలుడు ధాటికి ఆ బాణసంచా ఫ్యాక్టరీతోపాటు పక్కనే ఉన్న మరో 4 బిల్డింగ్‌లు కూడా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. వెంబకొట్టై సమీపంలోని రాము దేవన్‌పట్టిలో విజయ్ అనే వ్యక్తి నడుపుతున్న ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.
అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు కార్మికులు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూమ్‌లో ఈ భారీ పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది క్రిష్ణగిరిలోని బాణసంచా ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న భారీ పేలుడులో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 8 మంది కార్మికులు మృతి చెందారు.