లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతుంటే.. అధికార బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న వారు కూడా ఇటీవల పార్టీకి గుడ్ బై చెబుతూ.. కమలం పార్టీలో చేరుతుండటంతో హస్తం పార్టీకి ఏం చేయాలో తోచడం లేదు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తమ పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా కమలం పార్టీలో చేరే విషయానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు తెలిపారు.
అయితే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీతో తాను చర్చించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తాజాగా వెల్లడించారు. మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఖర్గే ప్రస్తావించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకరోజు ముందు నిర్వహించిన తేనీటి విందుకు ప్రధాని మోదీ కూడా వచ్చారని.. ఆ సమయంలోనే నేతల పార్టీ మార్పు గురించి చర్చించినట్లు తెలిపారు. ఇంకా ఎంత మంది మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలను బీజేపీ లాగేసుకుంటుంది అని తాను ప్రధాని మోదీని ప్రశ్నించినట్లు ఖర్గే తెలిపారు.
అయితే తాను అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం కూడా ఇచ్చినట్లు ఖర్గే చెప్పారు. ఆయా నేతలే బీజేపీలో చేరాలని అనుకుంటే తానేం చేయగలను అంటూ నరేంద్ర మోదీ బదులిచ్చినట్లు తెలిపారు. అయితే బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు నేతలను భయపెట్టడం వల్లే వారు బీజేపీ వైపు వస్తున్నారని.. తాను చెప్పగా.. ఆ వ్యాఖ్యలను ఆయన ఖండించారని ఖర్గే వివరించారు. బీజేపీ ప్రభుత్వం విధానాలు, పనితీరు నచ్చి నేతలు కమలం పార్టీలోకి వస్తున్నారని ప్రధాని చెప్పినట్లు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు.
అయితే ఇటీవలె మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్.. దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి కమలం పార్టీలో చేరారు. ఆ వెంటనే అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు నామినేట్ చేయగా.. ఆయన నామినేషన్ వేశారు. పార్టీలో చేరిన రెండో రోజే అశోక్ చవాన్‌కు రాజ్యసభ సీటు దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే గుర్తు చేశారు.