తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ అనే వ్యక్తి.. గత గురువారం సింహం చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకటంతో సింహం అతనిపై దాడిచేసి చంపేయటం కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు ముందు ప్రహ్లాద్ గుజ్జర్ చేసిన నిర్వాకం తాజాగా వెలుగుచూసింది. ఎస్వీ జూలోకి వెళ్లేముందు ప్రహ్లాద్ గుజ్జర్.. హథీరాంజీ మఠానికి చెందిన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బందితో గొడవపడి వారిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లిన ప్రహ్లాద్ గుజ్జర్ స్వామి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లాడు. అయితే దర్శనానికి టోకెన్ తీసుకోవాలని ఆలయ సిబ్బంది చెప్పడంతో వారితో గొడవపడ్డాడు. టోకెన్లు జారీచేసే యంత్రాలను మఠం సిబ్బందిపై విసిరేశాడు. చిన్నపాటి ఆయుధంతో చుట్టుపక్కల వారిని, ఆలయసిబ్బందిని బెదిరించాడు. దీంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు భయపడిపోయారు. అయితే కొంతమంది ధైర్యం చేసి అతన్ని చుట్టుముట్టి బంధించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు వేణుగోపాలస్వామి ఆలయానికి వచ్చిన సమయంలో అతను గంజాయి వినియోగించినట్లు అక్కడివారు గుర్తించినట్లు సమాచారం.
మరోవైపు గురువారం తిరుపతిలోని ఎస్వీజూకు వెళ్లిన ప్రహ్లాద్ గుజ్జర్.. ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. దీంతో అక్కడే ఉన్న సింహం ప్రహ్లాద్ మెడ భాగంలో కొరికి అతన్ని చంపేసింది. అయితే మత్తులోనే ప్రహ్లాద్ గుజ్జర్ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వేణుగోపాలస్వామి ఆలయం వద్ద సిబ్బందిపై గుజ్జర్ దాడి బయటకు వచ్చింది. దీంతో మత్తులోనే ప్రహ్లాద్ గుజ్జర్ సింహాల ఎన్‍క్లోజర్‌లోకి ప్రవేశించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.