ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైజాగ్ రూరల్ ఎమ్మా్ర్వో రమణయ్య మర్డర్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. భూమికి సంబంధించిన అంశంలో ఎమ్మార్వోను ఓ వ్యక్తి ఇంటి ఎదుటే దారుణంగా హత్య చేయడం ఇటీవల కలకలం రేపింది. రెవెన్యూ ఉద్యోగులు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రమణయ్య హత్య ఘటన నుంచి ఆ కుటుంబం ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో విషాద కర ఘటన చోటు చేసుకుంది. రమణయ్యకు వరుసకు సోదరుడు రాజేంద్రం కన్నమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాజేంద్ర శనివారం కన్నుమూశారు.
రమణయ్య హత్య కేసు దర్యాప్తు సమయంలో.. రాజేంద్ర ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. ఏడు ఎకరాల ల్యాండ్ కోసం ఓ వ్యక్తి రమణయ్యను బెదిరిస్తున్నాడని అతనే హత్య చేసి ఉంటాడంటూ కేసు విచారణ సమయంలో ఓ వ్యక్తిపై రాజేంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చంపింది గంగారావు అలియాస్ మురారి సుబ్రమణ్యం అని దర్యాప్తులో తేలింది. ఎమ్మార్వో హత్య సంగతికి వస్తే.. ల్యాండ్ విషయంలో కన్వేయన్స్ డీడ్ కు సంబంధించిన అంశంలో గంగారావు అనే వ్యక్తి తహశీల్దార్ సనపాల రమణయ్యను హత్యచేశాడు. ఎమ్మార్వో ఇంటి వద్దే రమణయ్యపై.. గంగారావు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు . ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
అయితే దాడి తర్వాత గంగారావు దర్జాగా విమానంలో పారిపోవటంపైనా విమర్శలు వచ్చాయి. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైజాగ్ పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలించి చెన్నైలో గంగారావును అదుపులోకి తీసుకున్నారు. పాస్ పోర్టులో షార్ట్ నేమ్ ఉండటంతో ఎయిర్ పోర్టు సిబ్బందిని బోల్తా కొట్టించిన గంగారావు.. వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి ట్రైన్‌లో చెన్నైకి చేరినట్లు వివరించారు. చివరకు చెన్నై శివార్లలో గంగారావు అదుపులోకి తీసుకున్నారు.