అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత రూపుదిద్దుకున్న భవ్య రామమందిరంలో కొలువైన బాలరాముడి దర్శనం కోసం క్యూ కడుతున్నారు. ఇలా తరలివచ్చే భక్తులతో అయోధ్యాపురి కిటకిటలాడుతోంది. నిత్యం వేలసంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్య దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అనేక చర్యలు తీసుకుంటోంది. ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులకు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తోంది. అయితే తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను, భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం తీర్థక్షేత్ర ట్రస్టుకు కాస్త ఇబ్బంది కరంగా మారింది.
మరోవైపు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు సైతం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటోంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సమయంలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీని కంట్రోల్ చేయటం ఎలా అనే అంశంపై టీటీడీ సాయం కోరింది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. తమకు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రస్టు విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు అయోధ్యకు వెళ్లి... ట్రస్టు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
అయోధ్య రామాలయంలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణపై ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ అధికారులు అవగాహన కల్పించారు. క్యూలైన్ల నిర్వహణపై సైతం టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి నేతృత్వంలోని దేవస్థానం అధికారుల బృందం ట్రస్టు ప్రతినిధులకు అవగాహన కల్పించింది. భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే దానిపైనా టీటీడీ అధికారులు.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు వివరించారు. అనంతరం టీటీడీ బృందానికి స్వామివారి దర్శనం కల్పించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.