ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. విశాఖ నగరానికి వచ్చే పర్యాటకులకు ఇది సరికొత్త ఆకర్షణ కానుంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ.. సముద్రంలో వంద అడుగుల దూరం వరకు వెళ్లి.. అక్కడున్న వ్యూపాయింట్ మీద నిలబడి సాగర అందాలను మరింతగా ఆస్వాదించొచ్చు. తెన్నేటి పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్ అడ్వెంచర్ టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకోనుంది.
అలల కారణంగా పర్యాటకులు సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉండటంతో.. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి రెండు వైపులా 34 సిమెంట్ దిమ్మెలతోపాటు అడ్డంగా రెండు ఐరన్ యాంకర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. ప్రతి 25 మీటర్లకూ లైఫ్ గార్డ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి ఇరువైపులా రెండు లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుతారు. ఈ తేలియాడే వంతెనపైకి ఒకేసారి 200 మంది వరకూ వెళ్లొచ్చు.
విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ శ్రీకాంత్ వర్మ, ఇతర అధికారులు కలిసి శనివారం ఫ్లోటింగ్ బ్రిడ్జిని తనిఖీ చేశారు. అధికార యంత్రాంగం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వెళ్లేందుకు ఒక్కొక్కరి దగ్గర్నుంచి రూ.100 నుంచి రూ.150 దాకా రుసుం వసూలు చేసే అవకాశం ఉంది.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పనుల కోసం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీ) టెండర్లు వేయగా.. శ్రీసాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ పనులను దక్కించుకుంది. కోటి రూపాయల ఖర్చుతో సదరు సంస్థ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది. కేరళలోని చవక్కడ్ బీచ్‌లో ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ స్ఫూర్తితో విశాఖలోనూ ఈ తేలియాడే వంతెనను ఏర్పాటు చేశామని శ్రీసాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ ప్రతినిధి సుదర్శన్ తెలిపారు. వీఎంఆర్డీఏ అధికారులతోపాటు కంపెనీ ప్రతినిధులు కేరళలోని ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను పరిశీలించిన తర్వాత.. విశాఖలో ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.