ఏపీ ఎన్నికలు అనగానే కులాల ప్రస్తావన తెర మీదకు వస్తుంది. ప్రధానంగా కమ్మ వర్సెస్ కాపు, కమ్మ వర్సెస్ రెడ్డిగా ఆంధ్రా రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు కారణంగా.. ఎన్నో ఏళ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న కమ్మ, కాపు సామాజికవర్గాలు ఒకరినొకరు కలుపుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. టీడీపీకి మొదటి నుంచి బీసీల మద్దతు ఎక్కువ. ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి.. అత్యధిక శాతం జనాభా ఉన్న కాపు సామాజికవర్గం తోడైతే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తేలికవుందనే ధీమా టీడీపీ-జనసేన కూటమిలోఉంది.
వైఎస్సార్సీపీకి సైతం రెడ్లు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీరితోపాటు దళితులు,క్రైస్తవులు ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. కమ్మ-కాపు ఈక్వేషన్‌ను దాటుకొని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. బీసీలను తమవైపు తిప్పుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా యాదవులు, శెట్టి బలిజల్లాంటి బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 7 శాతం ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలను కమ్మ నాయకులపైకి అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.
కోస్తాంధ్ర ప్రాంతంలో బలంగా ఉన్న టీడీపీకి.. యాదవ సామాజికవర్గ నేతలతో జగన్ చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే స్థానాలను ఆ సామాజికవర్గానికి చెందిన నేతలకే కేటాయిస్తున్నారు. నర్సరావుపేట లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలోకి దిగడం ఖాయమే. వైసీపీ సిట్టింగ్ ఎంపీ అయిన ఈయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను జగన్ బరిలోకి దింపుతున్నారు. నర్సరావుపేట లోక్ సభ స్థానాన్ని ఓ ప్రధాన పార్టీ బీసీలకు కేటాయించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇక ఏలూరు లోక్ సభ స్థానం నుంచి 2019లో టీడీపీ తరఫున కమ్మ సామాజికవర్గానికి చెందిన మాగంటి బాబు పోటీ చేశారు. ఈసారి ఇక్కడి నుంచి మాగంటి బాబు లేదా గోరుముచ్చు గోపాల్ యాదవ్ రేసులో ఉండగా.. వైసీపీ నుంచి యాదవ వర్గానికి చెందిన కారుమూరి సునీల్ బరిలోకి దిగనున్నారు. ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలో 2 లక్షలకుపైగా యాదవ ఓటర్లు ఉండగా.. ఈ సెగ్మెంట్ పరిధిలోని కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో యాదవుల ప్రాబల్యం ఎక్కువ.
మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేసే అవకాశం ఉండగా.. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుమలరావు బరిలోకి దిగనున్నారు. కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉండే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉండగా.. అరవింద్ యాదవ్‌కు వైసీపీ టికెట్ ఇవ్వడం ఖాయమే. కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజవకర్గంలో 1999లో తర్వాత టీడీపీ గెలిచింది లేదు. అయితే అరవింద్ యాదవ్ విజయానికి వైసీపీ కీలక నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సహకరిస్తారో లేదో చూడాలి.
కనిగిరిలో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేయగా.. మరోసారి ఆయన బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవగా.. ఈసారి యాదవ సామాజికవర్గానికి చెందిన నారాయణకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో తణుకులో టీడీపీ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేయగా.. వైసీపీ నుంచి పోటీ చేసిన యాదవ నేత కారుమూరి నాగేశ్వర రావు 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి కూడా వీరిద్దరే ముఖాముఖి తలపడే ఛాన్స్ ఉంది.
రాజమండ్రి ఎంపీ టికెట్‌ను టీడీపీ కమ్మ నేతలకు కేటాయిస్తుండగా.. గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన జగన్ సక్సెస్ అయ్యారు. ఈ విధంగా టీడీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్న బీసీ సామాజికవర్గాలను తనవైపు తిప్పుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. మరి ఈ వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలా చెక్ పెడతారో చూడాలి.