2014 నుంచి కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే అనేక ప్రయత్నాలు చేస్తుండగా.. అటు.. ఎన్డీఏ కూటమిని గద్దె దించాలని ఏర్పాటైన ఇండియా కూటమి రోజురోజుకూ బలహీనపడుతుండటంతో.. తమ విజయం మరోసారి ఖాయమేనని కాషాయ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మూడోసారి అధికారంలోకి రావాలని తాను కోరుకోవడం లేదని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన అలా ఎందుకు అన్నారంటే?
లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ.. ఢిల్లీలో బీజేపీ పార్టీ శ్రేణులతో రెండు రోజుల సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాషాయ పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. వచ్చే 100 రోజులు అందరికీ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమికి 400 పైగా సీట్లు రావాలన్నా.. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.
ఈ క్రమంలోనే ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అధికారం ముఖ్యం కాదని.. దేశం కోసం పనిచేయాలని అన్నారు. తన ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదని ప్రధాని తెలిపారు. గత 10 ఏళ్లుగా దేశంలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేలా చేయడం మామూలు విషయం కాదని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల కోసం కాకుండా.. దేశం కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు.
వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా 100 రోజుల్లో ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. ఈ క్రమంలోనే వచ్చే 100 రోజుల్లో మన అందరం ప్రతీ కొత్త ఓటరును, ప్రతీ లబ్ధిదారుడిని, ప్రతి సంఘాన్ని చేరుకోవాలని సూచించారు.