ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జార్ఖండ్ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మంత్రి పదవులు దక్కని 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి

national |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2024, 10:56 PM

ఇటీవల ఈడీ కేసులో అరెస్ట్ కావడానికి కొద్దిసేపటి ముందు జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో.. తీవ్ర విమర్శలు, ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో చంపై సోరెన్ నేతృత్వంలో కొత్త సర్కార్ జార్ఖండ్‌లో కొలువుదీరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం చంపై సోరెన్ మంత్రి వర్గ విస్తరణ చేశారు. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరడంతో మరోసారి జార్ఖండ్ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది.


జార్ఖండ్‌లో ఇటీవలె మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన చంపై సోరెన్‌ మంత్రి వర్గంలోని జేఎంఎం పార్టీకి చెందిన నలుగురు మంత్రులను తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తామని దాదాపు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చంపై సోరెన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.


ఈ క్రమంలోనే 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ ఎదుట తమ నిరసన వ్యక్తం చేయాలని ఆ ఎమ్మె్ల్యేలు నిర్ణయించుకున్నారు. జేఎంఎం పార్టీకి చెందిన ఆలంగిర్‌ ఆలమ్‌, రామేశ్వర్‌ ఓరోన్‌, బన్నా గుప్తా, బాదల్‌ పత్రలేకఖ్‌లకు ఇటీవలె సీఎం చంపై సోరెన్‌.. తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు.


అయితే ఈ నలుగురి పేర్లను ముందుగా ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హెచ్చరికలు చేశారు. వారికి మంత్రి పదవులు ఇస్తే.. రాజ్‌ భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తామని జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెగేసి చెప్పారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 47 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. వారిలో 29 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 17 మంది కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలుండగా.. 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో చంపై సోరెన్ అధికారంలో కొనసాగుతున్నాకు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేత గులాం అహ్మద్‌ మిర్‌, జార్ఖండ్ పీసీసీ చీఫ్‌ రాజేష్‌ అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.


తమకు ఒక్కో డివిజన్‌ నుంచి మంత్రి పదవి కావాలని అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జై మంగళ్ స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో 5 డివిజన్లను తాము కవర్‌ చేస్తామని.. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నిబంధనను అమలు చేయాలని తేల్చి చెప్పారు. ఒకవేళ ఆలంగీర్ ఆలం మంత్రి వర్గంలో కొనసాగితే.. సీఎల్‌పీ పదవిని వదులుకోవాలని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం తమ మాటను పట్టించుకోకపోతే.. రాజస్థాన్‌లోని జైపుర్‌కు వెళ్లిపోతామని మరో ఎమ్మెల్యే అనూప్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మేరకు పార్టీ హై కమాండ్‌కు లిఖిత పూర్వకంగా తమ డిమాండ్లకు సంబంధించిన లేఖను అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com