జైన మత ఆచార్యులలో ఒకరైన ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహరాజ్ అస్తమయం చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లో ఉన్న చంద్రగిరి తీర్థంలో ఉండే విద్యాసాగర్ జీ మహరాజ్.. కన్నుమూసినట్లు చంద్రగిరి తీర్థంలో ఉండే ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.35 గంటలకు విద్యాసాగర్ జీ మహరాజ్ చనిపోయినట్లు ప్రకటించారు. అయితే గత 3 రోజుల నుంచి మహారాజ్ ఆహారం, నీరు తీసుకోవడం మానేశారని వారు వెల్లడించారు. విద్యాసాగర్ జీ మహరాజ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఎక్స్ వేదికగా ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. "నా ఆలోచనలు, ప్రార్థనలు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ భక్తులతో ఉన్నాయి. సమాజానికి మహరాజ్ చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికతన పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, మరిన్నింటి కోసం చేసిన కృషికి రాబోయే తరాలకు గుర్తుండిపోతాయి. ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది. గత ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను విద్యాసాగర్ జీ మహారాజ్ జీని కలిసి వారి ఆశీస్సులు కూడా పొందాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
జైన మతానికి చెందిన ప్రముఖ ఆచార్యులలో విద్యాసాగర్ జీ మహరాజ్ ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు 77 ఏళ్లు. 1946 అక్టోబర్ 10 వ తేదీన విద్యాసాగర్ జీ మహరాజ్ కర్ణాటకలో జన్మించారు. మహారాజ్‌కు 3 సోదరులు, 2 సోదరీమణులు ఉన్నారు. ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ ఇప్పటివరకు 500 మందికి పైగా సన్యాసులకు దీక్షను అందించారు. ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గడ్‌లో ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
గత ఏడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. డోంగర్‌ఘడ్ చేరుకుని.. జైన సన్యాసి అయిన శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్‌ను దర్శించుకున్నారు. దిగంబర అవతారంలో చెక్క బల్లపై కూర్చున్న స్వామిజీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేసిన ప్రధాని.. ఆయన పాదాల వద్ద నేలపై కూర్చొని నమస్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.