జ్ఞానపీఠ్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లను తాజాగా జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ ప్రకటించింది. 2023 ఏడాదికి గాను ఇద్దరు ప్రముఖులకు ఈ జ్ఞానపీఠ్ అవార్డులు వరించాయి. ఫేమస్ ఉర్దూ కవి గుల్జార్‌తోపాటు సంస్కృత పండితులు అయిన జగద్గురు రామ భద్రాచార్యలు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ మేరకు 58 వ జ్ఞానపీఠ్ అవార్డులకు ఈ ఇద్దరినీ ఎంపిక చేసినట్లు శనివారం జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ ప్రకటించింది. రెండు భాషల్లో ప్రముఖ రచయితలైన గుల్జార్, జగద్గురు రామర భద్రాచార్యలకు ఈ ఏడాదికి జ్ఞానపీఠ్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ వెల్లడించింది.
అయితే 2022 కు సంబంధించి జ్ఞానపీఠ్ అవార్డును గోవా రచయిత అయిన దామోదర్ మౌజో దక్కించుకున్నారు. భారతీయ సాహిత్యంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఏటా అందించే జ్ఞానపీఠ్ అవార్డులకు ఈసారి సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామ భద్రాచార్య.. ఫేమస్ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్‌లను ఎంపిక చేస్తూ జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ నిర్ణయం తీసుకుంది. 1944 లో ఏర్పాటైన జ్ఞానపీఠ్ అవార్డును ఏటా అందిస్తున్నారు. ఇప్పటివరకు 57 సార్లు జ్ఞానపీఠ్ అవార్డుల ప్రకటన జరగ్గా.. ఇది 58 వది.
అయితే సంస్కృత భాషకు ఈ జ్ఞానపీఠ్ అవార్డు దక్కడం ఇది రెండోసారి దక్కడం విశేషం. ఇక ఉర్దూ భాషకు ఇప్పటివరకు 4 సార్లు అవార్డు వరించగా.. ఇది ఐదోసారి. అయితే జ్ఞానపీఠ్ అవార్డు దక్కించుకున్న వారికి రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, ప్రశంసపత్రాన్ని అందజేస్తారు. జ్ఞానపీఠ్ అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ప్రతిభా రాయ్ ఉన్నారు. ఇక సభ్యుల విషయానికి వస్తే తెలుగు జర్నలిస్ట్ అయిన ఎ.కృష్ణారావు ఉన్నారు.
89 ఏళ్ల గుల్జార్‌ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004 లో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇక 5 సార్లు జాతీయ ఫిలిం అవార్డులు దక్కించుకున్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది.
ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన 74 ఏళ్ల జగద్గురు రామ భద్రాచార్య మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద పరంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు కావడం గమనార్హం. 2 నెలల వయసులోనే ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయిన జగద్గురు.. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, 8 ఏళ్ల వయసులో రామచరితమానస్‌ను కంఠస్తం చేశారు. బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గాంచిన రామభద్రాచార్య.. 22 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవదీ, మైథిలీ వంటి భాషల్లో ఆయన రచనలు చేశారు. 240 కిపైగా పుస్తకాలు రాసిన జగద్గురును.. 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.