చైనా ఎప్పుడు దురాక్రమణకు దిగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న తైవాన్.. డ్రాగన్‌ను ఢీకొట్టేందుకు భారత్, అమెరికా దేశాలతో బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. ముఖ్యంగా ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటీవల తైవాన్ దృష్టి సారించింది. తాజాగా ఇరు దేశాల మధ్య కీలక ఎంఓయూ కుదిరింది. భారతీయ కార్మికులకు తైవాన్‌లో ఉపాధి కల్పించేందుకు ఇరు దేశాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ఈ ఎంఓయూకు రూపకల్పన చేశారు. తైవాన్‌తో ఎంఓయూపై సంతకం చేయాలని భారత్ గత ఏడాది నవంబర్లోనే ఓ నిర్ణయానికి వచ్చింది.
మాములుగానైతే ఆసియా దేశాల్లో జనాభా, మానవవనరుల లభ్యత ఎక్కువ. కానీ తైవాన్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. తైవాన్‌లో జననాల రేటు తక్కువగా నమోదవుతుండగా.. 2025 నాటికి ఆ దేశ జనాభాలో 20 శాతం మంది వృద్ధులే ఉండనున్నారు. దీంతో ఆ దేశం వలస కార్మికులపై ఆధారపడుతోంది. వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్ఫిన్స్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన 7 లక్షల మంది వలస కార్మికులు తైవాన్‌లో పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది తైవాన్‌లోని మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో లేదా ఇళ్లలో వృద్ధులకు సహాయకులుగా పని చేస్తున్నారు.
తైవాన్ తమ దేశంలో భాగమని చైనా చెప్పుకుంటోంది. దీంతో వన్ చైనా పాలసీకి కట్టుబడిన భారత్.. ఇప్పటి దాకా తైవాన్‌తో అధికారిక సంబంధాలు నెరపలేదు. కానీ ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు ఉన్నాయి. తైవాన్ టెక్నాలజీ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. భారతీయులు కష్టపడి పని చేస్తారని, నిలకడగా ఉంటారని తైవాన్ కార్మిక శాఖ గుర్తించింది. ఏళ్ల తరబడి చర్చల అనంతరం భారత్, తైవాన్ మధ్య కార్మికుల సరఫరా కోసం ఎంవోయూ కుదిరింది. తైవాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వన్ చైనా పాలసీ విషయంలో తన వైఖరి మారిందని భారత్ సంకేతాలు పంపినట్లు భావించొచ్చు.
ఇందులో భాగంగా లక్ష మంది భారతీయ కార్మికులకు తైవాన్‌లో పని చేసే సౌలభ్యం లభిస్తుంది. వీరికి మంచి వేతనాలతోపాటు సదుపాయాలను కల్పిస్తారు. తైవాన్‌కు అవసరాలకు అనుగుణంగా కార్మికులను భారత ప్రభుత్వమే ఎంపిక చేసి.. వారి శిక్షణ ఇచ్చి తైపీకి పంపిస్తుందని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా లక్ష మంది భారతీయులు తైవాన్‌లో పని చేయడానికి వెళ్లే అవకాశం ఉంది.
తైవాన్‌లో మావన వనరుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, వ్యవసాయ రంగాల్లో పనివారి కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది. దీంతో ఏటేటా వలస కార్మికులకు తైవాన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఇప్పటికే ఇజ్రాయెల్, భారత్ మధ్య కూడా ఈ తరహా ఒప్పందం కుదరగా.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సైతం ప్రారంభమైన సంగతి తెలిసిందే. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, సింగపూర్, మలేసియాతోపాటు పశ్చిమాసియా దేశాలు భారత కార్మికులను ఎక్కువగా పనిలోకి తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.