ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య జంపింగ్ జపాంగ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ పార్టీలో టికెట్ రానివారు ఆ పార్టీలోకి.. ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలు ఈ పార్టీలోకి దూకుతున్నారు. టికెట్ రాలేదనే కారణంతోనే, టికెట్ రాదనే భయంతోనే నేతలు కండువాలు మార్చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. నూజివీడు టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు సైకిల్ దిగి.. ఫ్యాన్ పార్టీలో చేరనున్నారు. సోమవారం వైసీపీ అధినేత జగన్‌ను ముద్రబోయిన కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నారని సమాచారం.
అయితే వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరతారనే ప్రచారంతోనే ముద్రబోయిన పార్టీ మారుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇంకా అధికారికంగా టీడీపీ గూటికి చేరలేదు. అయితే టీడీపీ శ్రేణులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెనమలూరు నుంచి పార్థసారథి టీడీపీ తరుఫున బరిలోకి దిగుతారనే వార్తలు వచ్చాయి. అయితే స్థానిక టీడీపీ నేత బోడె ప్రసాద్ వర్గం నుంచి వ్యతిరేకత రావటంతో అధిష్ఠానం పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నూజివీడులోని టీడీపీ నేతలతో పార్థసారథి చర్చలు జరుపుతున్నారు.
అయితే ఇన్నిరోజులు కష్టపడిన తనకు కాకుండా పార్థసారథికి అవకాశం ఇవ్వాలనుకోవటంపై ముద్రబోయిన ఫైర్ అవుతున్నారు. ఆదివారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ముద్రబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు. నూజివీడు ఇంచార్జిగా తాను ఉండగానే.. ఎమ్మెల్యే పార్థసారధి ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. తనకు నియోజకవర్గంలో ఎలాంటి చెడ్డపేరు లేదని.. కానీ ఎందుకు తనకు టికెట్ ఇవ్వడంలేదో చెప్పాలన్న ముద్రబోయిన.. కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అయితే సోమవారం అనూహ్యంగా సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు.. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని ఆయనకు వివరించారు. నూజివీడు నుంచి వైసీపీ తరుఫున అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.