ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23వతేదీన ఒంగోలు రానున్నారు. నగరానికి సమీపంలోని అగ్రహారం వద్ద జరిగే బహిరంగ సభలో అర్హులైన పేదలకు ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన ఖరారవడంతో సోమవారం సాయంత్రం రాష్ట్రమంత్రులు సురేష్, మేరుగ నాగార్జున, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినే్‌షకుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలు ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చే శారు. ఈసందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు నగరంలో అర్హులైన 22వేల మంది పేదలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద కార్యక్రమం ఈనెల 23న ఒంగోలులో జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ దినే్‌షకుమార్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు 536 ఎకరాల భూసేకరణ చేశామన్నారు. 22వేల మందికి ఈనెల 23న పట్టాల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.