ఒంగోలు జిల్లాలో జీరో నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ వచ్చేనెల 3వతేదీన జరిగే పల్స్‌పోలియోలో చుక్కలు వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం సాయంత్రం వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సున్నా నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 23,45,687 మంది ఉన్నారని, వారందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలన్నారు. అంతకు ముందు వైద్యాధికారులు మాట్లాడుతూ జిల్లాలో 224 పల్స్‌పోలియో కేంద్రాలు, 1591 మొబైల్, 70 ట్రాన్సిట్ బూత్‌లను గుర్తించి వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నామని జేసీ దృష్టికి తెచ్చారు. ఆయా అంశాలపై జేసీ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 3న ఎంపిక చేసిన కేంద్రాల్లో, 4, 5 తేదీల్లో గృహాలను సందర్శించి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ప్రతి సచివాలయం, ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, ముఖ్యకూడళ్లలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.