సీఎం జగన్ రెడ్డి.. ఏపీకు కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగడాలతోనే తమిళనాడుకు కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీకు పరిశ్రమలు, పెట్టుబడులు తేవడానికి అహర్నిశలు శ్రమించే వారని గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ పాలనలో అంతా రివర్స్.. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చే విషయంలో జగన్ వైఖరి సందేహాత్మకంగా ఉందని చెప్పారు. ప్రతిష్టాత్మక కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ పొరుగు రాష్ట్రానికి తరలిపోతే పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు.