ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ జంపింగ్‌లు కొనసాగుతున్నాయి.టికెట్లపై హామీ దక్కని నేతలు.. పార్టీలో ప్రాధాన్యం లేదని భావిస్తున్న వారు గోడలు దూకేస్తున్నారు. అధికార పార్టీ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ వైపు చూస్తుంటే.. మరికొందరు టీడీపీకి చెందిన ముఖ్య నేతలు టికెట్‌పై భరోసా లేకపోవడంతో వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వైఎస్సార్‌సీపీకి పలువురు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారు. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అయితే వీరిలో ఆర్కే మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఆర్కే బాటలోనే మరికొందరు నేతలు తిరిగి సొంత పార్టీకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణదేవరాయలు మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వెళతారని మరోసారి ప్రచారం మొదలైంది. ఎంపీ మనసు మార్చుకున్నారని.. వైఎస్సార్‌సీపీలోకి తిరిగి వెళతారనే టాక్ మొదలైంది. కొందరైతే ఏకంగా మళ్లీ నరసరావుపేట నుంచి పోటీ చేస్తారంటే.. మరికొందరు గుంటూరు నుంచి పోటీకి సిద్దమై వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శ్రీకృష్ణదేవరాయలు స్పందించిన ఆయన.. తాను ఎవరి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదని.. ఎవరినో కలవాలని వేచి చూడటం లేదని, ఎవరిని దేనికోసం ప్రాథేయపడటం లేదన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని కోరారు. అంతేకాదు త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో అనుచరులు క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే నరసరావుపేట లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తం చూసుకుని టీడీపీలో చేరతారంటున్నారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు 2019 ఎన్నికల్లో నరసరావపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలసారి ఎంపీగా విజయం సాధించారు. ఎలాంటి రాజకీయ అనుభవ లేకపోయినా.. భారీ మెజార్టీతో గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా మరోసారి నరసరావుపేట నుంచి బరిలోకి దిగాలని భావించారు. కానీ వైఎస్సార్‌సీపీ అధిష్టానం నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట టికెట్‌ను అధిష్టానం నిరాకరించింది.. ఈసారి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సూచించింది.
శ్రీకృష్ణదేవరాయలు రెండు, మూడు సార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తాను నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాని కోరారు. కానీ వైఎస్సార్‌సీపీ అధిష్టానం మాత్రం గుంటూరు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవితో పాటూ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశమై టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశం అయ్యారు. చివరికి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోపు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరే అవకాశం ఉంది. అయితే ఈలోపు వైఎస్సార్‌సీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌న ప్రకటించింది.