ఏపీ ప్రభుత్వం సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జీతాలు 23 శాతం పెంచుతూ సమగ్రశిక్ష తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి ఒక్కసారి కూడా జీతం పెరగని వారికి ఇది వర్తిస్తుందని తెలిపారు. సెక్షన్ ఆఫీసర్లు, సిస్టమ్ ఎనలిస్టులు, సైట్ ఇంజనీర్లు (బీటెక్), సైట్ ఇంజనీర్లు (డిప్లొమా), మెసెంజర్స్, ఐఈఆర్‌టీలు, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, డ్రైవర్లకు జీతం పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
ఉదాహరణకు సెక్షన్ ఆఫీసర్ జీతం ప్రస్తుతం రూ.28,940 ఉందని.. తాజా పెంపుతో అది రూ.35,596 అవుతుందన్నారు. అతి తక్కువ జీతాలున్న డ్రైవర్లకు కూడా ఇకపై రూ.24,600 వస్తుందని తెలిపారు. సమగ్రశిక్ష ఉద్యోగులు తమకు జీతాలు పెంచాలంటూ దాదాపు నెల రోజుల పాటు సమ్మె చేశారు. వైఎస్సార్2సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా జీతాలు పెంచని వారికి 23 శాతం పెంచుతామని అప్పట్లో విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని విద్యాశాఖలో ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న గౌరవ వేతనాల్ని తాము అధికారంలోకి రాగానే పెంచుతామని వైఎస్ జగన్ గతంలో హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ గౌరవ వేతనాల్ని పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్షలో పనిచేస్తూ 2019లో జీతాల పెంపు పొందని ఉద్యోగులందరికీ గౌరవ వేతనాలు పెంచింది.