ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు, ఏపీలో పొత్తుల కోసం తానెంత కష్టపడిందీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేనాని పర్యటించారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని కాపాడుకునేందుకే ఇతర పార్టీలతో జనసేన పొత్తు కుదుర్చుకుంటోందని అన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు చీలితే వైఎస్ జగన్ లాభపడతారన్న జనసేనాని.. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని కార్యకర్తలతో ఆ అనుభవాలను పంచుకున్నారు.
" ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలితే వైసీపీకి లాభం. అలా జరగకుండా ఉండాలనే పొత్తు కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే అదంతా సులభంగా జరగలేదు. పొత్తు కోసం వెళ్లి జాతీయ నాయకత్వంతో ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు. ఒప్పించేందుకు చాలా కష్టపడ్డా. అవమానాలను భరించా. అయితే నా లాభం కోసం పొత్తును ఆశించలేదు. ఏపీ భవిష్యత్తు కోసం ఆలోచించా. అందుకే తిట్టినా భరించా. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండాలని కోరుకున్నా. రాష్ట్ర బాగు కోసం అన్నీ భరించా" అని కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలను ఎవరూ ఆపలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ సిద్ధమంటే తాము యుద్ధమంటామంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు తమను ఎంతగా తిట్టినా భయపడేది లేదనీ.. వెనక్కి తగ్గేది అస్సలు లేదని స్పష్టం చేశారు. ఇక ఏపీలో ఎన్నికల మీద బెట్టింగులు భారీగా పెరుగుతున్నాయంటే అందుకు జనసేన పోటీలో ఉండటమే కారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ప్రస్తుత రాజకీయాలపైనా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బులు పెట్టుకుండా రాజకీయాలు చేద్దామంటే కుదరదని పవన్ అన్నారు. ఓట్లు కొంటారా లేదా అని నేతలే డిసైడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వచ్చే రోజుల్లోనైనా డబ్బులతో పనిలేని రాజకీయాలు చూడాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.