మావోయిస్టులకు పేలుడు సామగ్రి తరలిస్తున్న ఇద్దరు నింది తులను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చింతూరు ఏఎస్పీ మహేశ్వరరెడ్డి అందించిన వివరాలు ప్రకారం.. ఒడిసా రాష్ట్రం, మల్కాన్‌గిరి జిల్లా అనంతపల్లికి చెందిన నక్కా దావీదు, అలియాస్ డేవిడ్ రాజు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పట్నంపారాకు చెందిన భీమాల్ విశ్వాస్ తెలంగాణ రాష్ట్రం నుంచి వయా చింతూరు మండలం మీదుగా పేలుడు సామగ్రిని తరలించే యత్నం చేశారు. 30వ నెంబరు జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ సమయంలో వారి వద్ద పేలుడు సామగ్రి లభ్యమైందని ఏఎస్పీ చెప్పారు. పేలుడు సామగ్రిని మావోయిస్టులకు చేరవేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైందన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 95 డిటోనేటర్స్, 15 మీటర్ల ఫ్యూజ్ వైర్, 190 జెలిటిన్ స్టిక్స్, మావోయిస్టులు రాసి ఇచ్చిన పేలుడు సామగ్రి లిస్టు, రూ. 13 వేల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ గజేంద్ర కుమార్, ఎస్‌ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.