సీఎం జగన్ ‘సిద్ధం’ పేరుతో సభలు పెట్టి అశుద్ధం మాటలు చెబుతున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అభివృద్ధి పాలన ఎవరిదో... విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు. బూటకపు ప్రసంగాలు కాదు... దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని చెప్పారు. ఎవరి పాలన స్వర్ణయుగమో... ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం? చర్చకు రావాలి అన్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్‌కు రాజకీయంగా చివరి ఛాన్స్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఓటమి భయంతో 77 మందిని బదిలీలు చేసి జగన్ మడతపెట్టారని దెప్పిపొడిచారు. మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారన్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా..? అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఏ మూలన చూసినా వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఏ ఊరెళ్లినా ఐదేళ్లలో జగన్ చేసిన పాలనా విధ్వంసం కనిపిస్తోందని జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు.