ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. హెలీప్యాడ్, పార్కింగ్, బహిరంగ సభ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు భోజన వసతి కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడీ రాజశేఖర్, ఏఎస్పీ ఆరీఫుల్లా పాల్గొన్నారు.