ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎస్, సీఆర్పీసీ కాదు.. ఇక భారతీయ న్యాయ సంహిత, జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి

national |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 09:45 PM

జూలై 1 నుంచి దేశంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను కేంద్రం పూర్తిగా ప్రక్షాళించింది. వలస పాలన నాటి 3 నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితులకు, సవాళ్లకు తగినట్లు కొత్త చట్టాల్లో అనేక నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, భారత సాక్ష్యాధార చట్టం - 1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్రం శనివారం (ఫిబ్రవరి 24) తెలిపింది. ఈ కొత్త చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌ జారీ చేశారు.


భారతీయ భావనతో మన న్యాయ వ్యవస్థ ఉండేలా కొత్త బిల్లులను రూపొందించామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని ఈ బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా తెలిపారు. గతేడాది ఆగస్టులో ఆయన ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తర్వాత డిసెంబరు 25న రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి.


నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో కొత్తగా నేర చట్టాలను తీసుకొచ్చామని అమిత్‌ షా గతంలోనే చెప్పారు. కొత్త చట్టాల్లో ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. రాజద్రోహం లాంటి కొన్ని పదాలను తొలగించారు. దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చారు. పాత చట్టంలో హత్యను 302 సెక్షన్‌‌లో పేర్కొనగా.. కొత్త చట్టంలో దాన్ని 101 సెక్షన్‌గా పెట్టారు. పాత చట్టంలో అత్యాచారానికి సంబంధించిన శిక్షలు 375, 376 సెక్షన్లలో ఉండేవి. కొత్త చట్టాల్లో దీన్ని సెక్షన్‌ 63లో పేర్కొన్నారు. అదేవిధంగా కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్‌ ఉండగా.. కొత్త చట్టంలో దాన్ని సెక్షన్‌ 136 కింద పేర్కొన్నారు. కొత్తగా సమాజ సేవా శిక్షను పేర్కొన్నారు.


భారతీయ న్యాయ సంహిత బిల్లు 


‘నేరం’కు విస్తృత నిర్వచనం ఇచ్చారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలతో పాటు హిట్‌ అండ్‌ రన్‌, మూక దాడి, ఫేక్‌ వార్తలను ప్రచురించడాన్ని నేరాలుగా పేర్కొన్నారు. పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం తదితరాలను నేరాలుగా పేర్కొన్నారు.


★ ఐపీసీలోని 19 నిబంధనలను తొలగించారు. కొత్తగా 20 నేరాలను చేర్పారు.


★ కొత్తగా 6 నేరాల్లో ‘సమాజ సేవా శిక్ష’ విధించారు. రూ. 5000 లోపు దొంగతనాలకు సమాజ సేవా శిక్ష విధిస్తారు.


★ 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు, 83 నేరాల్లో జరిమానా మొత్తాన్ని పెంచారు.


★ 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధించారు.


ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగించారు.


★ భిక్షాటన - మానవ అక్రమ రవాణాను నేరంగా పేర్కొన్నారు.


★ పిల్లలకు నిర్వచనం ఇచ్చారు.


★ జెండర్‌లో ట్రాన్స్‌జెండర్‌ను చేర్పారు.


★ ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రికార్డులను దస్త్రాలుగా పరిగణించే అంశాన్ని చేర్చారు.


★ చరాస్తికి విస్తృత నిర్వచనం ఇచ్చారు.


★ మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం రూపొందించారు.


★ నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం తీసుకొచ్చారు.


★ పిచ్చివాడు, అవివేకి, ఇడియట్‌ లాంటి పురాతన పదాలను చట్టంలో తొమ్మిది చోట్ల తొలగించారు. బ్రిటీష్‌ క్యాలెండర్‌, క్వీన్‌, బ్రిటీష్‌ ఇండియా, శాంతి కోసం న్యాయం పదాలను తొలగించారు.


★ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ స్థానంలో ‘కోర్టు’ అని వాడాలని పేర్కొన్నారు. 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు చేర్చారు.


★ 12 చోట్ల డీనోట్స్‌ స్థానంలో మీన్స్‌ వాడాలని పేర్కొన్నారు. దటీజ్‌ టూ సే స్థానంలో నేమ్‌లీ వాడాలని చేర్చారు.


భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత


★ మేజిస్ట్రేట్‌ విధించే జరిమానా పరిమితిని పెంచారు.


★ ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధనను చేర్పారు.


★ దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్‌. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చు.


★ నేరాంగీకార పరిధిని విస్తరించారు. గతంలో ఈ అంశంలో 19 నేరాలు ఉండగా.. ప్రస్తుతం 10 ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ దీన్ని వర్తింపజేశారు. కొత్త బిల్లులో అత్యాచారం కేసును కూడా చేర్పారు.


★ జప్తు, స్వాధీనం లాంటి చర్యలకు విధివిధానాలు పేర్కొన్నారు.


★ మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్‌ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.


★ మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చారు. అయితే, బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదని స్పష్టం చేశారు.


★ తీర్పు వచ్చేవరకూ స్వయంగా హాజరుకాకపోయినా విచారణకు అవకాశం కల్పించారు.


★ 3 నుంచి 7 ఏళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి.


★ నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిల్ సరళీకరించారు.


★ తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు. నాలుగో వంతుగానీ, ఆరోవంతుగానీ విధించేలా నిబంధనల సడలింపు.


★ క్షమాభిక్ష పిటిషన్‌ విధివిధానాలను పేర్కొన్నారు.


★ సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకం పేర్కొన్నారు.


★ బాధితుల రక్షణ సంబంధిత నిబంధనలను చేర్పారు.


★ తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించారు.


★ 35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయాన్ని నిర్దేశించారు.


భారతీయ సాక్ష్య 


★ కొత్త చట్టంలో మొత్తం 6 సెక్షన్లను తొలగించారు. రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్‌ సెక్షన్లను జత చేశారు.


★ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. సాక్ష్యానికి నిర్వచనం ఇచ్చారు.


★ భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్‌ సాక్ష్యం సేకరణ జోడించారు.


★ బ్రిటీష్ కాలం నాటి పదబంధాలను తొలగించారు. భాషను ఆధునికీకరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com