టీడీపీ, జనసేన తొలి విడత జాబితా విడుదల తర్వాత ఆయా పార్టీలో అసమ్మతి స్వరాలు భగ్గుమన్నాయి. టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు అధిష్టానం మీద తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఫ్లెక్సీలు కాల్చేయడం, కుర్చీలు విరగ్గొట్టడం ఇలాంటి ఘటనలు శనివారం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక జనసేనలోని నేతలైతే ఏకంగా నిరాహార దీక్షలకు కూడా దిగారు. మరీ 24 సీట్లు తీసుకోవటం ఏమిటంటూ జనసేనాని మీద విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే సీటు దక్కని నేతలు.., టీడీపీ, జనసేన మీద అసంతృప్తితో ఉన్న లీడర్లు వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతూ ఉంది.
అయితే అలాంటి వారందరికీ.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు. ఎవరిని పడితే వారిని తమ పార్టీలోకి చేర్చుకోమని స్పష్టం చేశారు. ఇతర పార్టీల అసంతృప్తులను చేర్చుకుని ఇబ్బంది పడలేమని అన్నారు. మీడియాతో మాట్లాడిన సజ్జల టీడీపీ, జనసేన అసంతృప్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
"మేము అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు ఏదేదో జరిగిపోతోందని విమర్శించారు. అసంతృప్తులను పిలిచి మాట్లాడితే అంతా సర్దుకుంది.. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించారు. టీడీపీలోనూ అసంతృప్తులు ఉన్నారు. వారంతా మా పార్టీలోకి వస్తామంటున్నారు. అయితే మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. అలాంటి వారివల్ల మాకు అనవసరమైన తలనొప్పులు, పార్టీకేమో భారం.అవకాశం ఉన్న చోట వాళ్లను చేర్చుకునే అంశం పరిశీలిస్తాం" అని సజ్జల వ్యాఖ్యానించారు.
మరోవైపు మంగళవారం పార్టీ క్యాడర్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో మండల, బూత్ లెవల్‌లో పని చేసే పార్టీ శ్రేణులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీటింగ్ జరగనుంది.ఈ సమావేశంలో ఎన్నికల్లో ఎలా పని చేయాలనే దానిపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారని సజ్జల తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై అధినేత పార్టీ శ్రేణులకు వివరిస్తారని వెల్లడించారు.